గురువారం మధ్యాహ్నం వరకూ రాజీనామాకు ససేమిరా అన్న మంత్రి.. అంతలోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే, దీని వెనుక అధిష్ఠానం ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తోంది. అవినీతి కేసులో నిలువునా కూరుకుపోయిన మంత్రి ఈశ్వరప్ప పదవి నుంచి తప్పుకోవాలని, పోలీసులు ఆయనను అరెస్ట్ చేయాలని విపక్షాలు, వివిధ సంఘాల ఆందోళనలు నిర్వహించాయి. ఐపీసీ 306 కింద కేసు నమోదైతే మంత్రి పదవిలో కొనసాగే అర్హత కోల్పోయినట్లేనని కాంగ్రెస్, ఆప్‌లు ధ్వజమెత్తాయి.
మరోవైపు రాష్ట్ర కాంట్రాక్టర్ల శాఖల వారీ అవినీతి చిట్టాను బయటపెట్టేందుకు సిద్ధమైంది. అయితే, మంత్రి ఈశ్వరప్ప.. రాజీనామా అనివార్యం కాదని కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ అరుణ్‌సింగ్ సహా మంత్రివర్గ సహచరుల మద్దతుగా నిలిచారు. వాస్తవానికి మంత్రిపై ఆత్మహత్య ప్రేరేపణ, వేధింపుల కింద కేసు నమోదు చేసిన వెంటనే ఆయన రాజీనామా చేస్తారని అందరూ ఊహించారు.
తాను రాజీనామా చేయాల్సినంత తప్పు ఏమీ చేయలేదని ఈశ్వరప్ప స్పష్టం చేశారు. అంతేకాదు, ఆదేశాలు లేకుండా చేసిన పనులకు బిల్లులు ఎలా చెల్లించేదని నిబంధనలను ఏకరవుపెట్టారు. అలాగే, ‘రాజీనామా చేయాలని అధిష్ఠానం, సీఎం ఎవరూ కోరలేదు.. ఇలాంటి కేసులు వందలు చూశా’నంటూ ధీమా వ్యక్తం చేశారు. తనను రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని, వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు వర్క్ ఆర్డర్ లేకుండా పనులు చేస్తే బిల్లలు చెల్లించారా? అని ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించారు.
కర్ణాటక మంత్రి వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో బీజేపీ అధిష్ఠానానికి కాస్త ఇబ్బందికరంగా పరిణమించింది. దీంతో ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని సూచించినట్టు సమాచారం. సీఎం బసవరాజ్ బొమ్మై సైతం ఈ విషయంలో తాను ఎటువంటి ఒత్తిడికి గురికావడం లేదని మేకపోతు గాంబీర్యాన్ని ప్రదర్శించారు.